నియర్ స్పేస్’లోకి కొత్త ప్రయోగం..

నియర్ స్పేస్’లోకి కొత్త ప్రయోగం..

విజయవాడలో ప్రయోగ విజయవంతం…
సూపర్ ప్రెజర్ బెలూన్ విజయవంత పరీక్ష…
గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలే లక్ష్యం..
ఆంధ్రప్రదేశ్ నుంచి స్పేస్ ఎకానమీకి స్టార్టప్ బాటలు..

ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెడ్ బెలూన్ ఏరోస్పేస్ భారత అంతరిక్ష సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. సంస్థ అభివృద్ధి చేసిన ‘సూపర్ ప్రెజర్ బెలూన్’ను బుధవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రయోగాత్మకంగా విజయవంతంగా పరీక్షించారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు భారతదేశంలోనూ అందుబాటులోకి రావడం విశేషంగా మారింది.

ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకులు డాక్టర్ సీవీఎస్ కిరణ్, శిరీష్ మాట్లాడుతూ… దేశంలోనే తొలిసారిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్‌ను విజయవాడ గగనతలంలో పరీక్షించినట్లు వెల్లడించారు. ఈ బెలూన్లు భూమి నుంచి సుమారు 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి ‘నియర్ స్పేస్’ ప్రాంతంలో పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని వివరించారు.
గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అధునాతన ఇంటర్నెట్, టెలికాం సేవలను అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డ్రోన్లు, విమానాలు చేరలేని ఎత్తుల్లో ఈ ప్లాట్ఫాంలు పనిచేస్తూ ఉపగ్రహాలు, డ్రోన్లు చేసే సేవలను ఏకకాలంలో అందించగలవని పేర్కొన్నారు.

ఒక నియర్ స్పేస్ ప్లాట్ఫాం దాదాపు 400 సెల్ టవర్లకు సమానమైన కమ్యూనికేషన్ కవరేజీ ఇవ్వగలదని చెప్పారు. భవిష్యత్తులో బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, నాన్-టెరెస్ట్రియల్ నెట్వర్క, అలాగే 6జి కనెక్టివిటీ సేవలను ఈ సాంకేతికత ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను స్పేస్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషించనున్నదని, వచ్చే నెలాఖరులోపు ఈ సూపర్ ప్రెజర్ బెలూన్‌ను కమర్షియల్‌గా ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.