విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి.. మేడారంలో విషాదం

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి.. మేడారంలో విషాదం

తెగిన విద్యుత్ వైర్ సరిచేస్తుండగా దుర్ఘటన

ఆంధ్రప్రభ, తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడు వల్లెపు జానకిరామ్ (22)గా గుర్తించారు.

స్థానికుల కథనం ప్రకారం, జానకిరామ్ మేడారం పరిసర ప్రాంతాల్లో సోడాలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. బుధవారం రాత్రి కురిసిన వర్షాల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపోవడంతో వాటిని సరిచేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేడారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.