ఏఐతో మళ్లీ ఐటీ జోరు.. రెండేళ్ల మాంద్యానికి తెర.. క్యాంపస్ నియామకాలకు ఊపు
ఏఐతో మళ్లీ ఐటీ జోరు.. రెండేళ్ల మాంద్యానికి తెర.. క్యాంపస్ నియామకాలకు ఊపు
- రెండేళ్ల మందగమనానికి తెరపడుతున్న ఐటీ రంగం
- ఏఐ, క్లౌడ్ సేవలతో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు
- క్యాంపస్ నియామకాలను మళ్లీ ప్రారంభిస్తున్న ఐటీ దిగ్గజాలు
- తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త
- భవిష్యత్ ఉద్యోగాలకు నైపుణ్యాలే అసలైన అర్హత
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచ ఐటీ రంగాన్ని రెండేళ్లుగా వెంటాడిన మందగమనం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో ఐటీ వ్యయాలు పుంజుకోవడం, జనరేటివ్ ఏఐ ఆధారిత సేవలకు డిమాండ్ పెరగడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులు వేగం పుంజుకోవడంతో భారత ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలపై దృష్టి సారిస్తున్నాయి.
ఒకప్పుడు వేల సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులను క్యాంపస్‌ల నుంచే ఎంపిక చేసుకున్న భారత ఐటీ దిగ్గజాలు 2023-25 సంవత్సరాల మధ్యకాలంలో ప్రపంచ ఆర్థిక మందగమనం, అమెరికా-యూరప్ మార్కెట్లలో ఐటీ వ్యయాల కోత కారణంగా నియామకాలను నిలిపివేశాయి. రెండేళ్లుగా వేలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భారత ఐటీ రంగం మళ్లీ వృద్ధి బాట పడుతుండగా, క్యాంపస్ రిక్రూట్మెంట్లు వేగం అందుకుంటున్నాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా ఏడాది విరామం తర్వాత ఫ్రెషర్ల నియామకాలను తిరిగి ప్రారంభించడం ఐటీ పరిశ్రమలో సానుకూల సంకేతంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ విప్లవం మొదలైన తర్వాత సంస్థలు తమ వ్యాపార నమూనాలను పూర్తిగా మార్చుకుంటున్నాయి. కేవలం ఖర్చులు తగ్గించుకోవడం కాకుండా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలున్న మానవ వనరులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని నిర్ణయించాయి.
ఆదాయాలపై స్పష్టత రావడంతో ఐటీ కంపెనీల ఆర్డర్ బుక్ మెరుగుపడుతోంది. దీంతో భవిష్యత్ అవసరాలకు ముందుగానే ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించాయి. ఇదే ఐటీలో మళ్లీ జాబ్స్ జోష్ తీసుకొచ్చింది.
టెక్ మహీంద్రాతో పాటు దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, క్యాప్‌జెమినీ, యాక్సెంచర్ వంటి సంస్థలు ఇప్పటికే నియామకాలను వేగవంతం చేసినట్టు సమాచారం. విప్రో మాత్రం మార్కెట్ పరిస్థితులను బట్టి జాగ్రత్తగా ముందుకెళ్తోంది.
రెండేళ్లలో ప్లేస్‌మెంట్లు తగ్గిపోవడంతో ఆందోళనకు గురైన లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్థులకు తాజా పరిణామాలు ఊరటనిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఖర్చుల కోత, పెద్ద కంపెనీల్లో హైరింగ్‌పై భారీ కోత విధించడంతో ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్లేస్‌మెంట్లు పడిపోయాయి. అనేక కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్‌లే జరగకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, తయారీ, ఆరోగ్య, బీమా, రిటైల్ రంగాలు జనరేటివ్ ఏఐ సేవలను వినియోగిస్తున్నాయి. క్లౌడ్ మైగ్రేషన్, పాత సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను క్లౌడ్‌కు మార్చే ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ప్రతి సంస్థ కూడా ఏఐ ఆధారిత సేవలను ప్రారంభిస్తోంది.
మందగమనం నుంచి పునరుజ్జీవం వరకు…
2023-25 కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు వాయిదా పడటం, అధిక బెంచింగ్ కారణంగా భారత ఐటీ రంగం భారీ నియామకాలను నిలిపివేసింది. అనేక కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్‌లు జరగలేదు.
అయితే ఇప్పుడు ఏఐ ఆధారిత పరిష్కారాలు, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో కంపెనీలు కొత్త ప్రతిభ కోసం వెతుకుతున్నాయి.
జనరేటివ్ ఏఐ సేవలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ రావడంతో ఆ దిశగా ఐటీ సంస్థలు కార్యాచరణ ప్రారంభించాయి. క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులు పెరగడం, అమెరికా, యూరప్ ఖాతాదారుల నుంచి కొత్త ఆర్డర్లు రావడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగం పుంజుకోవడం, భవిష్యత్ అవసరాలకు ముందస్తు మానవ వనరుల సిద్ధీకరణ చేయడం దోహదపడుతున్నాయని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏఐతో మారుతున్న ఉద్యోగాల స్వరూపం
ఈసారి రిక్రూట్మెంట్లలో సంఖ్య కంటే నాణ్యతకే ప్రాధాన్యం పెరిగింది. ఉద్యోగం కావాలంటే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల డిగ్రీలు మాత్రమే చాలదు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్న వారికి ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు శుభవార్త
హైదరాబాద్ ప్రముఖ ఐటీ కేంద్రంగా కొనసాగుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మళ్లీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే పరిణామం.
భారత ఐటీ రంగం మరో కీలక దశలోకి అడుగుపెడుతోందని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎక్కువ మంది నియామకం లక్ష్యమైతే, ఇప్పుడు నైపుణ్యాలున్న ప్రతిభావంతుల ఎంపికపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లు పుంజుకోవడం శుభపరిణామమే అయినప్పటికీ, రేపటి ఉద్యోగ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే విద్యార్థులు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. భవిష్యత్ ఐటీ ఉద్యోగాలను నిర్ణయించేది డిగ్రీ కాదు… నైపుణ్యం అని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.
