చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న మంత్రి

చెన్నూరు (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించి పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులను స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటిస్తూ వేగంగా పూర్తి చేసి ప్రజలు, వ్యాపారులు వినియోగించుకునేలా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక మధునపు పోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.