పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం

  • జడ్జి దామెర ధీరజ్ కుమార్

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తోర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ప్రత్యేక అవగాహన సదస్సు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి మరియు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దామెర ధీరజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోర్టు సిబ్బంది, సీనియర్ న్యాయవాదులతో కలిసి ఆయన కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

అనంతరం నిర్వహించిన సదస్సులో జడ్జి ధీరజ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం ప్రకారం పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అవసరమని అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడం మన నైతిక విధి అని పేర్కొన్నారు.

భూతాపం (గ్లోబల్ వార్మింగ్), వాతావరణ మార్పులు ఇవి భవిష్యత్తు సమస్యలు కాదని, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యలని ఆయన హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటడం వంటి చిన్న మార్పులే పెద్ద ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి వృక్షాలుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ సైదులు, అడ్వకేట్లు రామకృష్ణ, మహేష్, కృపావతి, విజయ, యాకేందర్, లాలూ, గౌస్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ శ్రీనివాస్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రేవతి దేవి, కోర్టు సూపరింటెండెంట్, పారా లీగల్ వాలంటీర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొని పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు.