కామన్వెల్త్ విజయాల నుంచి ఒలింపిక్ లక్ష్యాల దిశగా..
కామన్వెల్త్ విజయాల నుంచి ఒలింపిక్ లక్ష్యాల దిశగా..
- గ్లాస్గో కామన్వెల్త్‌లో భారత్ మెరిసిన ప్రదర్శన
- పరిమిత క్రీడాంశాల్లోనూ పతకాల పంట
- యువశక్తి.. భారత క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాది
- ఖేలో ఇండియా నుంచి ఒలింపిక్ కల వరకు
- పారదర్శక పాలనతోనే ప్రపంచ క్రీడా శక్తిగా భారత్
- 2036 ఒలింపిక్స్ లక్ష్యానికి కామన్వెల్త్ విజయాలే పునాది
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరోసారి తన ప్రతిభను చాటింది. పరిమిత క్రీడాంశాలు, తగ్గిన పతకాల అవకాశాల మధ్యనూ భారత క్రీడాకారులు ఆశాజనక ప్రదర్శన కనబరిచారు. కామన్వెల్త్ విజయాల నుంచి ఒలింపిక్ లక్ష్యాల దిశగా సాగుతున్న భారత క్రీడా వ్యవస్థ.
క్రీడలు పతకాలకే పరిమితమయ్యే అంశం కాదు; అవి జాతీయ ఆత్మవిశ్వాసానికి, అంతర్జాతీయ ప్రతిష్ఠకు, యువతలో స్ఫూర్తిని నింపే శక్తివంతమైన సాధనం. ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించినప్పుడు కోట్లాది మంది భారతీయులు ఒకే భావోద్వేగంతో ఏకమవుతారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలకు అతీతంగా దేశాన్ని ఒక్క తాటిపై నిలబెట్టే శక్తి క్రీడలకు ఉంది. అందుకే ఆధునిక ప్రపంచంలో క్రీడలను దేశ నిర్మాణంలో కీలక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు.
గ్లాస్గో వేదికగా జూలై 23 నుంచి ఆగస్టు 2, 2026 వరకు జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడలు గత నిర్వహణలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా నిలిచాయి. మొత్తం 74 దేశాలు పాల్గొన్న ఈ క్రీడల్లో కేవలం 10 క్రీడాంశాలకే పరిమితమవడం విశేషం. భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. బాక్సింగ్ ఏకంగా ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలతో భారత బాక్సర్లు చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచారు. జూడోలో స్వర్ణాలు సాధించి కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. అథ్లెటిక్స్లో 100 మీటర్ల పరుగు, దీర్ఘదూర పరుగులు, పోల్‌వాల్ట్ వంటి విభాగాల్లో భారత అథ్లెట్లు పోటీ సామర్థ్యాన్ని ప్రదర్శించగా, పారా అథ్లెట్లు రికార్డు స్థాయిలో ఏడు పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. హాకీ, బ్యాడ్మింటన్, క్రికెట్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ వంటి భారత్‌కు సంప్రదాయంగా ఎక్కువ పతకాలు అందించే క్రీడలను ఈసారి కామన్వెల్త్ క్రీడల నుంచి తొలగించారు. దీంతో గత కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే భారత పతకాల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ పరిమిత క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు తమ పోరాట పటిమను చాటడం, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం గ్లాస్గో క్రీడల ప్రధాన విశేషంగా నిలిచింది. తక్కువ వ్యయంతో, పరిమిత వనరులతో క్రీడలను నిర్వహించాలనే కొత్త నమూనాకు గ్లాస్గో ఆతిథ్యం వహించింది.
భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం యువశక్తి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 సంవత్సరాల లోపు వారే. ఈ అపారమైన మానవ వనరులను క్రీడా ప్రతిభగా మలచగలిగితే ప్రపంచ క్రీడా రంగంలో భారత్ అగ్రశ్రేణి దేశంగా ఎదగడం అసాధ్యం కాదు. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు కేటాయింపులు 2013-14లో రూ.1,219 కోట్ల నుంచి 2026-27 కేంద్ర బడ్జెట్లో రూ.4,479.88 కోట్లకు పెరగడం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ పెట్టుబడులు కేవలం స్టేడియాల నిర్మాణానికే పరిమితం కావడం లేదు. చిన్న వయస్సులోనే ప్రతిభను గుర్తించడం, అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ, ఆధునిక పరికరాలు, పోషకాహారం, స్పోర్ట్స్ సైన్స్, ఫిట్‌నెస్, స్పోర్ట్స్ మెడిసిన్, మానసిక శిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ మార్పులో ఖేలో ఇండియా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభను వెలికితీసి, వారికి శిక్షణ, సౌకర్యాలు, పోటీ అవకాశాలు కల్పించడం ద్వారా భారత క్రీడా వ్యవస్థలో కొత్త తరం క్రీడాకారులు రూపుదిద్దుకుంటున్నారు.
అయితే ప్రపంచ క్రీడా శక్తిగా ఎదగాలంటే ప్రభుత్వ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. క్రీడా సంఘాల పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పక్షపాత ఎంపిక విధానం అత్యవసరం. రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థ ఏర్పడాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే డేటా విశ్లేషణ, బయోమెకానిక్స్, ఆధునిక కోచింగ్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి రంగాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శించాలంటే అనుకూల వాతావరణం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక భరోసా, గాయాల సమయంలో నాణ్యమైన వైద్యం, కెరీర్ భద్రత, మహిళా క్రీడాకారులకు సమాన అవకాశాలు, పదవీ విరమణ అనంతర ఉపాధి వంటి అంశాలను సమగ్ర క్రీడా విధానంలో భాగం చేయాల్సి ఉంది. క్రీడలను కేవలం అభిరుచిగా కాకుండా గౌరవప్రదమైన వృత్తిగా యువత స్వీకరించే పరిస్థితులు ఏర్పడితేనే భారత క్రీడా భవిష్యత్తు మరింత బలపడుతుంది.
ఈ నేపథ్యంలో 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే భారత లక్ష్యం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మహోత్సవాన్ని నిర్వహించడం ఒక ప్రతిష్టాత్మక అవకాశం మాత్రమే కాదు; భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే చారిత్రక సందర్భం కూడా. అంతర్జాతీయ ప్రమాణాల స్టేడియాలు, క్రీడా గ్రామాలు, సుస్థిర రవాణా వ్యవస్థ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత క్రీడా వేదికలు, సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఈ లక్ష్యానికి కీలకం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా క్రీడలతో పాటు నగరాభివృద్ధి, పర్యాటకం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కొత్త ఊతం లభిస్తుంది. అదే సమయంలో రానున్న ఆసియా క్రీడలు ఈ లక్ష్యానికి భారత క్రీడాకారుల సిద్ధతను పరీక్షించే కీలక వేదికగా మారనున్నాయి. గ్లాస్గోలో మెరిసిన కామన్వెల్త్ పతకాలు భారత క్రీడా వ్యవస్థ సరైన దిశలో సాగుతోందనే సంకేతాలను ఇచ్చాయి. అయితే ఈ విజయాలను ఒలింపిక్ స్థాయి విజయాలుగా మలచాలంటే నిరంతర పెట్టుబడులు, పారదర్శక క్రీడా పాలన, శాస్త్రీయ శిక్షణ, యువ ప్రతిభకు నిరంతర ప్రోత్సాహం అనివార్యం. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే భారత లక్ష్యంతో పాటు ప్రపంచ క్రీడా శక్తిగా ఎదగాలనే సంకల్పం సాకారం కావాలంటే కామన్వెల్త్ విజయాలను ఒక మైలురాయిగా తీసుకుని మరింత వేగంగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. గ్లాస్గోలో మెరిసిన ఈ పతకాల కాంతి భారత క్రీడల భవిష్యత్తుకు కొత్త వెలుగులు నింపుతోంది; ఆ వెలుగులను శాశ్వత విజయాలుగా మలచడం ఇప్పుడు దేశ క్రీడా విధానాల ముందున్న అసలైన సవాలు.
