RTC Bus | 21కి.మీ తర్వాత బస్సు ఢీ

RTC Bus | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జనగామలో ఓ మందుబాబు చేసిన నిర్వాకం స్థానికంగా కలకలం రేపింది. జనగామ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సును మత్తులో ఎత్తుకెళ్లి దాదాపు 21 కిలోమీటర్లు నడిపాడు. చివరకు బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పాలకుర్తికి చెందిన వెంకన్న గురువారం రాత్రి జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును తీసుకుని సూర్యాపేట వైపు బయలుదేరాడు. సింగరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపానికి చేరుకున్న తర్వాత బస్సు అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో బస్సు అక్కడే ఆగిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. “బస్సును ఎందుకు తీసుకెళ్లావు?” అని ప్రశ్నించగా, “ఊరికే ట్రయల్ వేద్దామని బస్సు నడిపాను” అని సమాధానం చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆర్టీసీ ఆస్తికి నష్టం వాటిల్లిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.