హరహర మహాదేవ నినాదాలతో మారుమోగిన కాళేశ్వరం క్షేత్రం
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ అరణ్య శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు ఆదివారం అత్యంత వైభవంగా కొనసాగాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల కలయికైన పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల్లో తెల్లవారుజాము నుంచే ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో పుష్కర స్థానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 365 వత్తులతో దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. త్రివేణి సంగమానికి చీర సమర్పించి గోదావరి నది ఒడ్డున ప్రతిష్ఠించిన సరస్వతీ మాతకు విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. శ్రీ శుభానంద పార్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం మొత్తం “హర హర మహాదేవ”, “శంభో శంకర”, “ఓం నమః శివాయ” నామస్మరణలతో మారుమోగింది. ఎక్కడ చూసినా భక్తి పరవశంతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కూడా కాళేశ్వరానికి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. శ్రీ అద్వైతానంద భారతి శ్రీ శ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు త్రివేణి సంగమంలో పుష్కర స్థానం ఆచరించి దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాళేశ్వరానికి చేరుకుని సరస్వతి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తన అనుచరులు, మిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఘాట్‌ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా వైద్యశిబిరాలు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులకు సూచనలు అందిస్తున్నారు.
వేలాది మంది భక్తులు తరలిరావడంతో కాళేశ్వరం క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. త్రివేణి సంగమం నుంచి ఆలయ ప్రాంగణం వరకు ఎక్కడ చూసినా భక్తి, భజనలు, శివనామస్మరణలతో పుష్కర వైభవం తారాస్థాయికి చేరింది.
