పారిశుద్ధ్య కార్మికులకు నెల మొదటి తేదీనే వేతనాలు

పారిశుద్ధ్య కార్మికులకు నెల మొదటి తేదీనే వేతనాలు
– ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీననే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పట్ల సిపిఐ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎఐటీయూసీ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సంఘం మండల కోశాధికారి మామిడిపెల్లి రవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నల్లబెల్లిలో జరిగిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు ఈ నిర్ణయంతో తెరపడిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గత రెండు నెలలుగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సమయానికి వేతనాలు చెల్లించాలని, ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని, అలాగే వారిని అధికారికంగా కార్మికులుగా గుర్తిస్తూ కార్మిక చట్టాలను అమలు చేయాలని సిపిఐ పార్టీ పోరాటం చేసిందని ఆయన గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
సిపిఐ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని రవి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను జూన్ మొదటి తేదీ లోపు పూర్తిగా చెల్లించాలని కోరారు. అలాగే పారిశుద్ధ్య సిబ్బందికి కార్మిక చట్టాల రక్షణలను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య, ఎంపీడబ్ల్యూ సంఘం గౌరవ అధ్యక్షులు జన్ను సుదర్శన్, మండల నాయకులు అంబి రాజు, లోనే లింగయ్య, కనకం రాజు, గుండెబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
