ఏపీలో నాలుగు వర్సిటీలకు గుర్తింపు.. రూ.56.11 కోట్ల సాయం
- పార్లమెంట్లో ఎంపీ కేశినేని ప్రశ్నకు కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం
- జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా వ్యవసాయ విద్యలో సమగ్ర సంస్కరణలు
- దేశవ్యాప్తంగా 1,902 ఇండస్ట్రీ, అకాడమియా ఒప్పందాలతో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు
- ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం
- నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, పరిశ్రమల అనుసంధానంతో వ్యవసాయ విద్యకు కొత్త దిశ
విజయవాడ, ఆంధ్రప్రభ: దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, పరిశ్రమల భాగస్వామ్యం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, కేంద్రం అందిస్తున్న నిధులపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి సమగ్ర లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానంకు అనుగుణంగా వ్యవసాయ విద్యను ఆధునీకరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో రూ.56.11 కోట్ల కేంద్ర సాయం అందించినట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పన, ఇంటర్న్‌షిప్‌లు, సంయుక్త పరిశోధనలు, అధ్యాపకుల పరస్పర మార్పిడి వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య ఇప్పటికే 1,902 ఇండస్ట్రీ–అకాడమియా అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) అమల్లో ఉన్నాయని, వీటి ద్వారా విద్యార్థులకు పరిశ్రమల్లో శిక్షణ, పరిశోధన అవకాశాలు, ప్రత్యక్ష అనుభవం లభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ దేశంలోని గుర్తింపు పొందిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల జాబితాలో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ విశ్వవిద్యాలయాల్లో 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు అమలులో ఉన్నాయని తెలిపారు.
వ్యవసాయ విద్యా సంస్థల్లో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా నాణ్యత పెంపు కోసం గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.56.11 కోట్లు, దేశవ్యాప్తంగా రూ.1,679.13 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు భగీరథ్ చౌదరి వెల్లడించారు. ఈ సంస్కరణలతో వ్యవసాయ విద్యార్థుల్లో నైపుణ్యాలు, పరిశోధన సామర్థ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది. వ్యవసాయ విద్యను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ యువతకు మెరుగైన భవిష్యత్ కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు
