నేడు జాతికి అంకితమైన రోజు..!
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆగస్టు 4, 1967… తెలుగు రాష్ట్రాల వ్యవసాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల్లోకి నీటిని విడుదల చేసి ఈ మహత్తర ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
కృష్ణా నదిపై తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు (అప్పటి గుంటూరు) జిల్లా సరిహద్దులో నిర్మించిన నాగార్జునసాగర్ డ్యాం పూర్తి కావడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. భారీ యంత్రాలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది కార్మికులు రాయి, సున్నంతో చేతిపనిగా నిర్మించిన ఈ ఆనకట్ట ప్రపంచంలోనే అతిపెద్ద రాతి నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందడమే కాకుండా జలవిద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోంది. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలంగా మార్చడంలో నాగార్జునసాగర్ కీలక పాత్ర పోషించింది.
స్వాతంత్య్రం అనంతరం దేశ అభివృద్ధిలో భాగంగా భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వగా, నల్లగొండ జిల్లా నందికొండ వద్ద కృష్ణానదిపై నాగార్జునసాగర్ నిర్మించాలని నిర్ణయించారు. సముద్ర మట్టానికి 546 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఆనకట్ట ద్వారా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించారు.
నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన..
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సుమారు రోజుకు 45 వేల మంది కార్మికులు 12 సంవత్సరాల పాటు శ్రమించి ఈ మహా నిర్మాణాన్ని సాకారం చేశారు. నిర్మాణ కాలమంతా కలిపి సుమారు 19 కోట్ల 71 లక్షల మానవ శ్రమ దినాలు ఈ ప్రాజెక్టు కోసం వినియోగించబడ్డాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
జాతికి అంకితం చేసిన ఇందిరా గాంధీ
1967లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కాలువల్లోకి నీటిని విడుదల చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయన కుమార్తె ఇందిరా గాంధీ జాతికి అంకితం చేయడం చరిత్రలో నిలిచిపోయిన విశేషం.
ఆ కాలంలో ఈ మహా ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.98 కోట్లు మాత్రమే వ్యయమైంది. నేటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్మాణాన్ని చేపట్టాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
‘నవదేవాలయంలో పనిచేయడం అదృష్టం’
తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టల్లో ఒకటైన ఈ ప్రాజెక్టులో సేవలందించడం గర్వకారణమని వారు పేర్కొంటున్నారు.
లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ, జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ఈ మహా నిర్మాణం నిజంగా ఒక “నవదేవాలయం” అని అధికారులు అభివర్ణిస్తున్నారు. నాగార్జునసాగర్ కేవలం ఒక ఆనకట్ట మాత్రమే కాదు… కోట్లాది మంది రైతుల జీవితాలను మార్చిన అభివృద్ధి చిహ్నమని వారు పేర్కొంటున్నారు.
