మధ్యాహ్న భోజన నాణ్యతపై రాజీ వద్దు

మధ్యాహ్న భోజన నాణ్యతపై రాజీ వద్దు

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం..

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ఆంధ్రప్రభ, దండేపల్లి: దండేపల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ సెకండరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన సిబ్బందికి గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్శ రాజేశ్వర్‌రావు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. వంట పాత్రలను వేడి నీటితో శుభ్రం చేయడంతో పాటు వంటగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. తాగునీటి ట్యాంకులను కూడా నిరంతరం శుభ్రపరచాలని తెలిపారు. బియ్యాన్ని వండే ముందు శుభ్రం చేసుకోవడంతో పాటు నాణ్యమైన పప్పులు, తాజా కూరగాయలు, మంచి నూనెను మాత్రమే వినియోగించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజనం తయారీ సమయంలో సిబ్బంది నిర్దేశిత డ్రెస్ కోడ్‌ ప్రకారం జాకెట్, తలకు టోపీ, చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు. మెనూ ప్రకారం వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందించాలని, భోజనాన్ని పాఠశాల ప్రాంగణంలోనే వండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహారం అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని కోరారు.

Slu