వైఎస్సార్ నగర్ భూములపై బీజేపీ ఫైర్.. ‘పేదల భూములు కాజేస్తే ఊరుకోం’

వైఎస్సార్ నగర్ భూములపై బీజేపీ ఫైర్.. ‘పేదల భూములు కాజేస్తే ఊరుకోం’

రూ.300 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ

ఆంధ్రప్రభ, ఉమ్మడి వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని వైఎస్సార్ నగర్ గుడిసెవాసులను బెదిరించి, దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి ఆరోపించారు. గురువారం కాజీపేటలోని వైఎస్సార్ నగర్‌ను సందర్శించిన ఆమె స్థానిక గుడిసెవాసులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా రావు పద్మారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ నగర్‌లోని పేద ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఆ భూమిని కాపాడుకున్నారని గుర్తు చేశారు. అలాంటి విలువైన ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సంస్థలకు, కాంగ్రెస్ అనుచరులకు లేదా భూకబ్జాదారులకు అప్పగించే ప్రయత్నాలు జరిగితే బీజేపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించకుండా ఐటీఐ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆస్పత్రి లేదా ఏసీపీ కార్యాలయం వంటి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని సూచించారు. వైఎస్సార్ నగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న అర్హులైన పేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఖర్చుతో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. పేదలను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు, తోపుచర్ల అర్చన, కాయిత రాజ్‌కుమార్, మేకల శ్రావణ్, రేణుకుంట్ల కల్యాణ్, తిరుపతి నాయక్, భగవాన్ ఉపాధ్యాయ, ఆదిత్య సాయి, చాంద్ పాషా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.