యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలి
యోగాంధ్ర విజయవంతానికి అందరూ సహకరించాలి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: భారతీయ సంస్కృతికి యోగా ప్రతీక అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంతతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. ఒత్తిడి, షుగర్, గుండెపోటు వంటి సమస్యల నియంత్రణకు యోగా ఎంతో అవసరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు.
యువత చెడు అలవాట్లను వీడి యోగాను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఇంట్లో రోజూ కనీసం అరగంట యోగా చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా ఈ ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో ప్రభుత్వ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
జూన్ 21న అమరావతిలో భారీ యోగా వేడుకలు నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించనున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
