పత్తి దిగుమతులకు గ్రీన్‌సిగ్నల్.. సీసీఐ నిల్వలపై రూ.120 కోట్ల ముప్పు
పత్తి దిగుమతులకు గ్రీన్‌సిగ్నల్.. సీసీఐ నిల్వలపై రూ.120 కోట్ల ముప్పు
దిగుమతి సుంకం తొలగింపుతో దేశీయ మార్కెట్‌పై ఒత్తిడి
ఏపీలో సీసీఐ వద్ద 4 లక్షల బేళ్ల నిల్వలు
ధరలు తగ్గితే రూ.120 కోట్ల వరకు ప్రభావం
ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని తొలగించిన నిర్ణయం రైతులకే కాదు, రైతుల కోసం కొనుగోళ్లు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కూ ఆర్థిక సవాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత సీజన్‌లో మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే దిగువకు పడిపోవడంతో రైతులకు అండగా నిలిచిన సీసీఐ భారీ స్థాయిలో పత్తిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ నిల్వలు గోదాముల్లో ఉండగానే విదేశీ పత్తికి దిగుమతి మార్గం సులభతరం కావడంతో దేశీయ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గితే రైతుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసిన పత్తి విలువ క్షీణించి, సీసీఐకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గతం కంటే భిన్నమైన పరిస్థితులు
గత పత్తి సీజన్‌లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీసీఐ పెద్దఎత్తున కొనుగోళ్లు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 4 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్వింటాలుకు సుమారు రూ.8,100 చొప్పున కొనుగోలు చేసిన ఈ పత్తి ప్రస్తుతం సీసీఐ గోదాముల్లో నిల్వ ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఒక క్యాండీ ధర సుమారు రూ.65 వేల వరకు పలుకుతోంది. అయితే దిగుమతి సుంకం మినహాయింపుతో విదేశీ పత్తి తక్కువ ధరలకు మార్కెట్‌లోకి ప్రవేశిస్తే దేశీయ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
నిల్వలపైనే రూ.120 కోట్ల భారం
మార్కెట్ ధరలు సగటున 10 శాతం మేర తగ్గితే ఒక్కో బేలు విలువలో సుమారు రూ.3 వేల వరకు తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో సీసీఐ వద్ద ఉన్న 4 లక్షల బేళ్ల నిల్వలపైనే సుమారు రూ.120 కోట్ల మేర విలువ తగ్గుదల సంభవించవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ విదేశీ పత్తి దిగుమతులు భారీగా పెరిగి మార్కెట్‌పై మరింత ఒత్తిడి తెస్తే ఒక్కో బేలు ధర రూ.6 వేల వరకు తగ్గే అవకాశమూ ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
దేశవ్యాప్తంగా భారీ నష్టం ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లోని నిల్వలపైనే రూ.120 కోట్ల వరకు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, పంజాబ్ వంటి ప్రధాన పత్తి ఉత్పత్తి రాష్ట్రాల్లో సీసీఐ వద్ద ఉన్న నిల్వలను కలుపుకుంటే దేశవ్యాప్తంగా నష్టం మరింత భారీ స్థాయికి చేరుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వస్త్ర పరిశ్రమకు ముడిసరుకు ధరలు తగ్గించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం చివరకు రైతులు, సీసీఐ, ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర ప్రభావం చూపుతుందన్నది రానున్న నెలల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
