శాకాంబరీ అలంకారంలో లంకమ్మ, తుంగపల్లెమ్మ తల్లుల దివ్య దర్శనం..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : దివిసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అవనిగడ్డ శ్రీ లంకమ్మ తల్లి దేవాలయం, మాచవరం శ్రీ తుంగపల్లెమ్మ తల్లి ఆలయాల్లో అమ్మవార్లు ఆదివారం భక్తులకు శాకాంబరీ దేవి అలంకారంలో నయనమనోహరంగా దర్శనమిచ్చారు.
లోకకళ్యాణం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవార్లను వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించారు. అవనిగడ్డ శ్రీ లంకమ్మ తల్లి దేవాలయం, మాచవరం శ్రీ తుంగపల్లెమ్మ తల్లి ఆలయాల్లో ఉదయం నుంచే అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
