రివర్స్ పంపింగ్‌తో ముప్కాల్ వద్ద జలకళ…
4.80 మీటర్లకు చేరిన నీటిమట్టం
బాల్కొండ,ఆగస్టు 3 (ఆంధ్రప్రభ) ఎన్నో సంవత్సరాలుగా ఆశించిన దృశ్యం మళ్లీ కనిపిస్తోంది. శ్రీరాంసాగర్ పునర్జీవం పథకం (ఎస్సారెస్పీ) లో భాగంగా రాజేశ్వరపేటలోని కి.మీ.34 పంప్‌హౌస్ నుంచి చేపట్టిన రివర్స్ పంపింగ్ ద్వారా నీరు సోమవారం ఉదయం ఇందిరమ్మ వరద కాలువలోకి చేరడంతో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ సమీపంలో గల హెడ్ రెగ్యులేటర్ నిండుకుండలా మారింది. ఒకప్పుడు వెలవెలబోయిన కాలువ ప్రస్తుతం జలకళ సంతరించుకోవడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి నిరంతరంగా నీరు చేరుతుండటంతో ముప్కాల్ వద్ద ఉన్న ఇందిరమ్మ వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రవాహం కొనసాగుతోంది. అధికారుల వివరాల ప్రకారం, ఇందిరమ్మ వరద కాలువలో కి.మీ.0.765 వద్ద నీటిమట్టం ప్రస్తుతం 4.80 మీటర్లుగా నమోదైంది. ఈ స్థాయిలో నీరు ఉండటం వల్ల కాలువ పూర్తిస్థాయిలో నిండిన దృశ్యం కనిపిస్తోంది.ఈ నీటి ప్రవాహంతో వరద కాలువ పరిధిలోని ఆయకట్టు భూములకు సాగునీరు అందే అవకాశాలు మెరుగుపడ్డాయి.
అలాగే చెరువులు, కుంటలు నింపడంతో పాటు భూగర్భ జలమట్టం పెరిగి బోర్లు, బావులకు కూడా ఉపయోగం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకు ఈ నీరు ఎంతో ఉపయుక్తంగా మారుతుందని రైతులు పేర్కొంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శ్రీరాంసాగర్ పునర్జీవం పథకం ద్వారా రివర్స్ పంపింగ్ కొనసాగుతుండటంతో వరద కాలువ మళ్లీ జీవం పోసుకున్నట్లు కనిపిస్తోంది. నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయ రంగానికి ఊతం లభించడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
