- ప్రజా స్వామిక హక్కును కాలరాస్తారా..
- కలెక్టర్ స్థాయిలో పత్రికా స్వేచ్ఛను హరించడం బాధాకరం
- చిత్తూరు కలెక్టర్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం.
- మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య
తిరుపతి, ఆంధ్రప్రభ : అవినీతికి వ్యతిరేకంగా, గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై వేధింపులకు దిగడం బాధాకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
గ్రావెల్ మాఫియా, అవినీతి, బియ్యం అక్రమ రవాణా, కలప స్మగ్లింగ్ వంటి అంశాలను లేవనెత్తి వార్తలు రాస్తున్న చిన్న స్థాయి విలేకరుల అక్రిడేషన్ రద్దు చేయడం బాధాకరమన్నారు. గంగాధర నెల్లూరులో అక్కడి స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలంతో చర్యలకు ఉపక్రమించడం దారుణమన్నారు.
చిన్న స్థాయి కంట్రిబ్యూటర్లపై కలెక్టర్ ప్రతాపం చూపడమే కాకుండా, రూల్స్ పాటించకుండా అక్రిడేషన్ రద్దు చేయడం సరైన పద్ధతి కాదని కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. సీపీఐ పార్టీ తరఫున కలెక్టర్ చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఎలాంటి విచారణ జరపకుండా, అక్రిడేషన్ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా కలెక్టర్ విలేకరుల అక్రిడేషన్ రద్దుకు పూనుకోవడం సరైన చర్య కాదని వ్యతిరేకించారు. స్మగ్లర్లు, మాఫియాను అడ్డుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తూ చిన్న స్థాయి విలేకరులపై వారి కలాలను ఝుళిపించడంపై దారుణమన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

