తిరుపతిలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
తిరుపతి, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పార్సల్ కార్యాలయాల్లో నార్కోటిక్ డాగ్స్ సహాయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.

అనుమానాస్పద వస్తువులు, పార్సిళ్లు, సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు, సరఫరా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగంపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ “జీరో టాలరెన్స్” విధానాన్ని అమలు చేస్తోందని అధికారులు స్పష్టం చేశారు.

యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల సహకారంతో మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ప్రజల భద్రత, యువత భవిష్యత్తు పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
