ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించాలి..
ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించాలి..
- లక్ష్మిపూర్ గ్రామసభలో తీర్మానం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం సర్పంచ్ ముక్కిస కవిత మరియు రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలగడమే కాకుండా, దీని వలన తెలియకుండానే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, ప్రత్యామ్నాయంగా మోతుకు ఆకులతో తయారు చేసిన ఇస్తార్లను వినియోగించాలని సూచించారు. ఇవి పర్యావరణానికి హానికరం కానివని, ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయని తెలిపారు. గ్రామంలో టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు వంటి ప్లాస్టిక్ వస్తువులను వాడకాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు గ్రామస్థులంతా కలిసి పనిచేయాలని తీర్మానించారు. అలాగే వర్షాకాలంలో దోమల వ్యాప్తి నివారణ కోసం మురికివాడల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ లేదా బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా దోమల నివారణ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామంలో ఎలాంటి విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతను పాటించాలని గ్రామసభలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషన్, గ్రామ పాలకవర్గ సభ్యులు అనసూయ, సంధ్య, శ్రీనివాస్ రెడ్డి, తిరుమల, పద్మ, అర్జున్, రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజిరెడ్డి, సత్తిరెడ్డి, సీఏ లావణ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
