ఇంధన ధరల పెంపుపై రాజకీయ పార్టీల ఆగ్రహం..
జూన్ 9 నిరసనకు మద్దతు కోరింపు
హిందూపురం, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల పిలుపు మేరకు జూన్ 9న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హిందూపురం ఆర్ అండ్ బి బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి ఏ. శ్రీనివాసులు, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శ్రీరాములు, దళిత సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎస్. నారాయణ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఎస్‌యూసీఐ నాయకుడు రంగనాయకులు, కీర్తి జై భీమ్ రావు భారత్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఊటుకూరు నాగరాజు, ఆల్ ఇండియా బీఎస్పీ నాయకుడు హరికుమార్, ఆర్‌ఎస్‌పీ నాయకుడు పత్తికుంటపల్లి రామాంజి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మే నెల నుంచి ఇప్పటి వరకు పలుమార్లు పెట్రోల్, డీజిల్, గృహ, వాణిజ్య గ్యాస్ ధరలను పెంచడం వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడిందని విమర్శించారు. చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అనేక వ్యాపారాలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనం మరింత కష్టంగా మారిందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఎరువుల ధరల పెరుగుదల రైతులకు అదనపు భారంగా మారిందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆరోపించిన నాయకులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడానికి అధిక పన్నులే కారణమని విమర్శించారు.
కృష్ణా–గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువును రాష్ట్ర ప్రజల అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని, రాష్ట్రానికి తగిన వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరించారు.
