Weekend Getaways | వర్షాకాలం వచ్చేసింది.. చల్లగా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ బెస్ట్!

Weekend Getaways | వర్షాకాలం వచ్చేసింది.. చల్లగా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ బెస్ట్!

ఆంధ్రప్రభ, Weekend Getaways : ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, వాటి ప్రభావం తెలంగాణపై కూడా క్రమంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా భానుడి భగభగలతో అల్లాడిపోయిన నేల ఇప్పుడు చల్లబడేందుకు సిద్ధమవుతోంది.

సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఏసీలు, కూలర్ల మధ్యనే సెలవులు గడిపేశారు. సరదాగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలన్నా మండే ఎండలు అడ్డుగా నిలిచాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో చెరువులు, కుంటలు, జలాశయాలు, జలపాతాలు కూడా తమ సహజ అందాన్ని కోల్పోయాయి.

అయితే ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. వర్షాలు ప్రారంభమవుతుండటంతో ప్రకృతి మళ్లీ కొత్త కళను సంతరించుకుంటోంది. ఎండిపోయిన వాగులు, వంకలు నీటితో నిండిపోనున్నాయి. జలపాతాలు జలజలా పారుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పచ్చని కొండలు, మేఘాల అందాలు, చల్లని వాతావరణం పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో కొంత సమయం గడపాలని అనుకుంటే.. మీరు వెళ్లబోయే ఆ డెస్టినేషన్ మరింత ప్రత్యేకంగా మారనుంది. వర్షపు చినుకుల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఇది సరైన సమయం.

తెలంగాణ నయాగరాలు..

తెలంగాణ ఉత్తర ద్వారం ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే అడవులు, గిరిజన సంస్కృతి, ప్రకృతి అందాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైతే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు జలపాతాల హబ్‌గా, ప్రకృతి ప్రేమికులకు హాట్‌స్పాట్‌గా మారిపోతాయి. కొండల మధ్య నుంచి పాలధారలా జాలువారే జలాలు, పచ్చని అడవులు, పొగమంచు కమ్ముకున్న లోయలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ప్రతి ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆదిలాబాద్ జలపాతాల అందాలను ఆస్వాదించేందుకు తరలివస్తుంటారు.

కుంటాల జలపాతం..
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కడెం నదిపై ఉన్న కుంటాల జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. సుమారు 147 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ జలధారలు వర్షాకాలంలో మరింత ఉద్ధృతంగా ప్రవహిస్తాయి. కుంటాల అనే గిరిజన యువతి పేరుతో ఈ జలపాతానికి పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం. తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల, ఫోటోగ్రఫీకి అద్భుతమైన లొకేషన్‌తో పాటు అడవి మధ్య ట్రెక్కింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

పొచ్చెర జలపాతం..
కుంటాలకు సమీపంలో ఉన్న పొచ్చెర జలపాతం తన ఉగ్రరూపంతో ప్రసిద్ధి చెందింది. భారీ రాతి శిలల మధ్య నుంచి ప్ర‌వ‌హించే జలధారలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో జలపాతం దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఉండదు. అయితే వ్యూ పాయింట్ నుంచి కనిపించే దృశ్యం మాత్రం మరపురానిది.

Weekend Getaways
Weekend Getaways
Weekend Getaways

గాయత్రి జలపాతం…
ఆదిలాబాద్‌లోని అత్యంత అందమైన జలపాతాల్లో గాయత్రి జలపాతం ఒకటి. ఇంకా పూర్తిగా కమర్షియల్ కాకపోయినా, ఈ జలపాతం అందించే అనుభూతి మాత్రం మరపురానిది. అడవి మధ్యలో కొంత దూరం ట్రెక్కింగ్ చేసి చేరుకోవాల్సి ఉండటంతో సాహస యాత్రికులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పచ్చని అటవీ ప్రాంతం, తక్కువ జనసంచారం, సహజ సౌందర్యం ఈ జలపాతం ప్రత్యేకతలు. జూలై నుంచి నవంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం.

కనకాయ జలపాతం..
ఆదిలాబాద్‌కు సమీపంలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న కనకాయ జలపాతం ఇటీవల కాలంలో పర్యాటకులకు హాట్‌స్పాట్‌గా మారింది. ద‌ట్ట‌మైన‌ అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం వర్షాకాలంలో పాలవెల్లువలా ప్రవహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటుంది. గిరిజన ప్రాంతం నడుమ ఉన్న ఈ జలపాతం కుటుంబ విహారయాత్రలకు అనువైన ప్రదేశం. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి, ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది అద్భుతమైన గమ్యస్థానం.

Weekend Getaways

పిప్పిరిగుండం జలపాతం..
ఇంకా పూర్తిగా పర్యాటక రంగంలో వెలుగులోకి రాని పిప్పిరిగుండం జలపాతం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. చుట్టూ విస్తరించిన పచ్చని అడవులు, పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంత ప్రత్యేకత. నగర జీవన హడావుడికి దూరంగా ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశంగా నిలుస్తుంది.

ఎలా వెళ్లాలి?
ఈ జలపాతాలను సందర్శించాలంటే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. జాతీయ రహదారి-44 (NH-44) ద్వారా రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. అలాగే, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వరకు రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అక్కడి నుంచి టాక్సీలు, క్యాబ్‌లు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయ, పిప్పిరిగుండం జలపాతాలకు చేరుకోవచ్చు.

వర్షాకాలంలో జలపాతాల పరిసరాల్లో రాళ్లు జారుడుగా ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ప్రయాణించాలి. లోతైన నీటిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. అటవీ శాఖ, స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో సందర్శిస్తే జలపాతాల అందాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ భద్రతా జాగ్రత్తలు పాటిస్తే ఈ యాత్ర మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

రోజూ ఉండే వర్క్ లోడ్, హడావుడికి కాస్త బ్రేక్ ఇచ్చి, వర్షపు చినుకుల మధ్య ప్రకృతి ఒడిలో రిలాక్స్ కావాలనుకుంటే.. ఈ సీజన్‌లో ఆదిలాబాద్ జలపాతాలు మీ ట్రావెల్ లిస్ట్‌లో తప్పక ఉండాల్సిన డెస్టినేషన్స్. ఒకసారి వెళ్లొస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే మ్యాజిక్ ఈ తెలంగాణ నయాగరాల సొంతం.

Under-17 wrestling | ఆధార్ వెరిఫికేషన్‌తో రెజ్లర్లకు భారీ షాక్..

Weekend Getaways, Weekend Getaways Weekend Getaways Weekend Getaways Weekend Getaways Weekend Getaways Weekend Getaways Weekend Getaways