వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరం
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గూడమామడ గ్రామంలో శనివారం వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.
వర్షాకాలంలో వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆశా వర్కర్ల ద్వారా ఆరోగ్య అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని గ్రామ సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు సూచించారు.
డ్రైడే కార్యక్రమంలో భాగంగా వర్షం కురుస్తున్నప్పటికీ సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు వైద్య సిబ్బందితో కలిసి గొడుగులు పట్టుకుని ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ, వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇళ్లలో నీటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచకూడదని, అలా ఉంచితే దోమల లార్వా పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. ఇల్లు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరాడే శివాజీ, హెల్త్ అసిస్టెంట్ పెందూర్ భరత్, ఏఎన్ఎం సేవంత, అంగన్వాడీ టీచర్ కుడుమేత బిజులబాయి, సీహెచ్డబ్ల్యూ, ఆశా వర్కర్ కుమ్ర లింగాదేవి, గ్రామస్థులు పాల్గొన్నారు.
