జీవితాన్ని క్రమ శిక్షణతో నడిపించే శక్తి యోగా ఇస్తుంది..
జీవితాన్ని క్రమ శిక్షణతో నడిపించే శక్తి యోగా ఇస్తుంది..
యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సామాజ నిర్మాణమే లక్ష్యం..
యోగాసనాలతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన సామాజ నిర్మాణమే లక్ష్యమని ప్రతి ఒక్కరూ రోజు యోగాసనాలను ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో యోగాన్ని ఒక భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం భవానిపురంలోని బెరం పార్కు లో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఆయుష్ కమిషనర్ గోపాలకృష్ణ, నగర మున్సిపల్ కమిషనర్ హెచఎం ధ్యానచంద్ర, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా పాల్గొన్ని యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర ఒక ఉద్యమంలా రూపుదిద్దుకుని ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందుతుందన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు.
ప్రత్యేక యోగా కార్యక్రమాల నిర్వహణతో పాటు విద్య సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయడం జరిగిందన్నారు. ఆయుష్ శాఖ నిపుణులు రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్‌లోని ఆసనాలు సులభంగా ప్రతి ఒక్కరూ చేయగలవని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారు యోగా చేయవచ్చని చెప్పారు. రోజుకు కేవలం 40 నుంచి 45 నిమిషాల సమయం కేటాయించి యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యకర జీవనశైలి సాధ్యమవుతుందన్నారు.
ప్రస్తుతం పెరుగుతున్న ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ వంటి జీవనశైలి వ్యాధులను నివారించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు, పనిలో సామర్థ్య వృద్ధి, జీవితంలో సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు.
యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, శిక్షకులు, విద్యాసంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, ప్రజలందరికీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌వో డా. జె. ఇందుమతి, జిల్లా ఆయుష్ అధికారి డా. వై రత్న ప్రియదర్శిని, నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, డిఆర్డిఏ పిడి ఏన్వి నాంచారరావు, జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కె. రమేష్, వివిధ శాఖల చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
