విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్‌కు గురైన అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి రంజిత్ కుమార్ (34) టీజీఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన గౌండ్ల భర్తయ్య వ్యవసాయ పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ దెబ్బతిన్నట్టు సమాచారం అందడంతో మరమ్మతుల కోసం అక్కడికి వెళ్లాడు.
ఫ్యూజ్ ఏర్పాటు చేసే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపోవడంతో 11 కేవీ విద్యుత్ లైన్‌కు అతని కుడిచేయి తగిలి తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే సహచర ఉద్యోగులు, స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విధి నిర్వహణలోనే యువ ఉద్యోగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. కేసు నమోదు చేసినట్టు సంగారెడ్డి రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
