వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం.. వృద్ధుడి దుర్మరణం
హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ: వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాయపర్తి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జగిరి బిక్షపతి (80) అనే వృద్ధుడు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం, రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం వాహనం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు కూడా వాహనం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుడు బిక్షపతికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
