భార్యపై బ్లేడుతో దాడి.. భర్తకు ఆరు నెలల జైలు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దన్నూరా బి గ్రామానికి చెందిన కనాడే తుకారం (35) భార్యపై దాడి చేసి బ్లేడుతో గాయపరిచిన కేసులో ఉట్నూర్ న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. 2023 ఏప్రిల్ 18న మద్యం సేవించేందుకు భార్య కూలికి వెళ్లి సంపాదించిన రూ.500 ఇవ్వాలని గొడవపడి, ఆమెను చేతులతో కొట్టి బ్లేడుతో గాయపరిచాడు. బాధితురాలు కనాడే రాధాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై డి. సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా కోర్టు డ్యూటీ అధికారి ఏ. నరేష్ ఆరుగురు సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. మౌనిక నేరాన్ని రుజువు చేశారు. దీంతో ఉట్నూర్ న్యాయమూర్తి పి. మౌనిక నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నేరం రుజువు చేయడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.
