ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

  • అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల నమోదును వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సూచించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని 19వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని కల్వగడ్డ కృష్ణ మందిరంలో జరుగుతున్న ఎన్యుమరేషన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అలాగే కల్వగడ్డ, రథలగూడి, బ్రహ్మపురి కాలనీల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి దరఖాస్తులు మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు భాగస్వాములు కావాలని తెలిపారు. కాలనీవాసుల సహకారంతో నిర్ణీత గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేసి, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవిదాస్, తహసీల్దార్ రాజు, వార్డు కౌన్సిలర్ నర్స, కో-ఆప్షన్ సభ్యురాలు అపర్ణ ప్రదీప్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.