ఎనిమిదేళ్లుగా కుటుంబ పెన్షన్ కోసం ఎదురుచూపులు

భర్త మృతితో కుటుంబ భారమంతా భుజాన.. కూలి పనులతో ముగ్గురు పిల్లలను పోషిస్తున్న పద్మావతి

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: కుటుంబానికి అండగా నిలిచిన భర్త ఆకస్మికంగా మృతి చెందడంతో జీవితం అస్తవ్యస్తమైన ఓ మహిళ, ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) కుటుంబ పెన్షన్ కోసం ఎనిమిదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవలీ కాలనీలో నివసిస్తున్న ఎం. పద్మావతి పరిస్థితి ఇదే.

ఆమె భర్త ఎం. శ్రీనివాసులు (స్టాఫ్ నంబర్: 406111) కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ, 2019 జూన్ 6న విధుల్లో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురై మృతి చెందారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న ఆయన మరణంతో భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.

భర్త మరణానంతరం ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) నుంచి కుటుంబ పెన్షన్ పొందేందుకు అవసరమైన దరఖాస్తు సమర్పించినప్పటికీ, ఎనిమిదేళ్లుగా పెన్షన్ మంజూరు కాలేదని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కార్యాలయాలకు పలుమార్లు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

కుటుంబ పోషణ కోసం ప్రస్తుతం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నానని, పని దొరికితేనే ఇంట్లో పొయ్యి అంటుతోందని ఆమె వాపోయారు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, వైద్య అవసరాలు భరించడం రోజురోజుకూ కష్టంగా మారుతోందని చెప్పారు. భర్త ఉద్యోగంలో ఉండగానే మరణించినప్పటికీ, తనకు రావాల్సిన కుటుంబ పెన్షన్ ఇప్పటికీ అందకపోవడం బాధాకరమన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా మంత్రి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు హైదరాబాద్ బర్కత్‌పురలోని ఈపీఎఫ్ అధికారులకు స్పీడ్ పోస్టు ద్వారా వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు. తన దరఖాస్తును పరిశీలించి కుటుంబ పెన్షన్ మంజూరు చేసి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.

“భర్తను కోల్పోయిన బాధ ఒకవైపు.. పిల్లలను పోషించే బాధ మరోవైపు ఉంది. ఎనిమిదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నాకు రావాల్సిన కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలి. అదే మా కుటుంబానికి పెద్ద అండ అవుతుంది” అని పద్మావతి విజ్ఞప్తి చేశారు.

సామాజిక భద్రత కోసం అమలులో ఉన్న కుటుంబ పెన్షన్ పథకాల ప్రయోజనాలు అర్హులకు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పద్మావతి వంటి బాధితుల వినతులను సానుభూతితో పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తే ఇలాంటి కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.