ఉషగంలో తాగునీటి కష్టాలు.. బావి నీళ్లే ఆధారం
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉషగం గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. గ్రామంలోని మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ శివారులోని బావి నుంచి ఎడ్లబండ్లపై, తలపై బిందెలతో నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని, చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్పందించి చెడిపోయిన మంచినీటి పథకాలను వెంటనే మరమ్మతులు చేయించి, ఉషగం గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
