2026 Bonalu | భక్తులకు అసౌకర్యం క‌ల‌గొద్దు..

బోనాల పండ‌గ‌ను వైభవంగా నిర్వ‌హించాలి
ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సర్వం సిద్ధం..
ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
సికింద్రాబాద్‌లో సమన్వయ సమావేశం నిర్వహించిన పోలీసులు, ప్రభుత్వ శాఖల అధికారులు
భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, ఉత్సవాల నిర్వహణపై విస్తృత చర్చ
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సూచన

2026 Bonalu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర–2026 ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. జాతర నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై సమీక్షించేందుకు గురువారం సికింద్రాబాద్‌లోని విశ్వకర్మ ఫంక్షన్ హాల్‌లో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి సికింద్రాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్ అధ్యక్షత వహించారు. సమావేశంలో అదనపు డీసీపీ జె. నర్సయ్య, ఏసీపీ చ. శ్రీధర్, మహంకాళి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు, పలహారం బండ్ల నిర్వాహకులు, తోటెల నిర్వాహకులు, వెల్‌కమ్ స్టేజ్ నిర్వాహకులు, వివిధ ఉత్సవ కమిటీల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బోనాల జాతరను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. ట్రాఫిక్ నిర్వహణ, భద్రత, అత్యవసర సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత శాఖలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ, బోనాల జాతర విజయవంతం కావాలంటే అన్ని ప్రభుత్వ శాఖలు, ఆలయ కమిటీలు, ఉత్సవ నిర్వాహకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అప్పగించిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.