ఇద్దరు పిల్లల మధ్య సరైన ఎడం ఉండాలి:

వైద్యాధికారి డాక్టర్ రమ్య

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శావల్యాపురంలో అవగాహన ర్యాలీ

శావల్యాపురం, ఆంధ్రప్రభ: ఇద్దరు పిల్లల మధ్య కనీసం 18 నుంచి 24 నెలల వ్యవధి ఉండాలని, అప్పుడే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని మండల వైద్యాధికారి డాక్టర్ రావిపూడి రమ్య అన్నారు. తక్కువ వ్యవధిలో గర్భం దాల్చితే తల్లిలో రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రమ్య మాట్లాడుతూ “పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

పిల్లల జననాల మధ్య తగిన వ్యవధి పాటించడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. బిడ్డకు తగినంత మాతృపాలు అందడంతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదుగుతారని, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వివరించారు.

పిల్లల మధ్య సరైన వ్యవధి కోసం నోటి గర్భనిరోధక మాత్రలు, నిరోధ్‌లు, అంతరా ఇంజెక్షన్లు, లూప్ (ఐయూసీడీ) వంటి గర్భనిరోధక సాధనాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు నారాయణమ్మ, ఏడుకొండలు, ల్యాబ్ టెక్నీషియన్ సతీష్, ఫార్మసిస్ట్ లక్ష్మీనారాయణ, స్టాఫ్ నర్స్ ప్రమీల పాల్గొన్నారు.