Water Crisis | ముంబైలో వరదలు.. హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు..?

Water Crisis | ముంబైలో వరదలు.. హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు..?


-దేశంలో వాతావరణం రెండు ముఖాలు..
-ఒకచోట వరదలు.. మరోచోట కరవు

Water Crisis | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఒకవైపు కుండపోత వర్షాలు.. మరోవై పు చుక్క నీటికోసం ఎదురుచూపులు. ప్రస్తుతం దేశంలో ఎల్‌నినో ప్రభావం ఇదే విరుద్ధ చిత్రాన్ని చూపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, రాయ్‌గఢ్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాభావం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం మాత్రమే కాదు.. హైదరాబాద్ వంటి మహానగరంలో తాగునీటి సంక్షోభం కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రైతన్నకు వర్షమే ఆశ.. కానీ మేఘాలు మాత్రం మొండిచేయి
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు ప్రస్తుతం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ.. సరిపడా వర్షాలు లేక సాగు పనులు మందగించాయి. విత్తనాలు వేసిన రైతులు మొలకలు వస్తాయా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. మరికొందరు వర్షాలు పడే వరకు సాగును వాయిదా వేస్తున్నారు. వర్షాల ఆలస్యం కొనసాగితే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌కు తాగునీటి హెచ్చరిక

వర్షాభావం ప్రభావం గ్రామాలకే పరిమితం కావడం లేదు. హైదరాబాద్ నగరంపైనా దీని ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. అధికార గణాంకాల ప్రకారం ప్రస్తుతం భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవు. జంట జలాశయాలతో పాటు ఇతర నీటి వనరుల్లోకి గణనీయమైన ప్రవాహం రావాలంటే విస్తృతంగా, నిరంతరాయంగా వర్షాలు కురవాల్సి ఉంది. కేవలం ఒకటి రెండు రోజుల వర్షాలతో నగరానికి పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

భారీ వర్షలోటు.. త‌గ్గిన జ‌లాశ‌యాల నీటి మ‌ట్టం

ఈ ఏడాది వర్షాకాలంలో నమోదైన వర్షపాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉందని వాతావరణ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే భారీ లోటు నమోదైంది. ఇదే పరిస్థితి మరో కొన్ని వారాలు కొనసాగితే భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెరగడంతో పాటు తాగునీటి నిల్వలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 514.40 అడుగులుగా నమోదైంది. ఇది 510 అడుగుల కంటే దిగువకు పడిపోతే అత్యవసర పంపింగ్‌ చేపట్టకుండా హైదరాబాద్‌కు కృష్ణా జలాల సరఫరా చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో తాగునీటి డిమాండ్‌కు, సరఫరాకు మధ్య గణనీయమైన అంతరం ఉంది. ప్రస్తుతం జలమండలి రోజుకు 550 ఎంజీడీల నీటిని నగరానికి సరఫరా చేస్తుండగా, అందులో కృష్ణా ప్రాజెక్టు నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 163 ఎంజీడీలు, సింగూరు–మంజీరా ప్రాజెక్టుల నుంచి 90 ఎంజీడీలు అందుతున్నాయి. మరో 27 ఎంజీడీల నీరు జంట జలాశయాల ద్వారా సరఫరా అవుతోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే నాగార్జునసాగర్‌లో నీటిమట్టం మరింత తగ్గి, నగర తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి నీటి బొట్టూ ఒడిసి ప‌ట్టాల్సిందే..


ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వినియోగంపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం లేని నీటి వృథాను అరికట్టడం, వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇంటి వద్దే నీటి పొదుపు చర్యలు చేపట్టడం అత్యవసరమని చెబుతున్నారు. ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో నగర ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వర్షాల కోసం ఎదురుచూపులే..!


మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అదే వర్షం కోసం రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రకృతి చూపిస్తున్న ఈ విరుద్ధ పరిస్థితులు ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురవకపోతే వ్యవసాయం, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎందుకు ఇలా..

ముంబైలో భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం కనిపించడానికి ప్రధాన కారణం రుతుపవనాల అసమాన చలనం. ప్రస్తుతం అరేబియా సముద్ర శాఖ మహారాష్ట్ర తీరంలో చురుకుగా ఉండటంతో ముంబై, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం లేకపోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన తేమగాలులు చేరడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో కూడా రుతుపవనాల తీరు మారడంతో వర్షాల పంపిణీలో అసమానత ఏర్పడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితేనే తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.