Kavitha | శాంతిభద్రతల ప‌రిర‌క్ష‌ణ‌లో విఫ‌లం : క‌విత‌

ఆరుగురు హత్యకు గురైన ఘటనలపై భద్రతా వైఫల్యమంటూ మండిపాటు
నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

Kavitha | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆరుగురు హత్యలకు సంబంధించిన ఘటనలపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

విమర్శకుల ప్రకారం, పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ నిందితుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాలిక తల్లి, నాన్నమ్మను హత్య చేశాడని, ఆ తర్వాత తన భార్య, పిల్లలను కూడా హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వరుస నేరాలు జరుగుతున్నప్పటికీ, నిఘా వ్యవస్థ, పోలీసులు నిందితుడిని అడ్డుకోలేకపోవడం తీవ్ర వైఫల్యమని ఆరోపించారు.

ఇంతటి క్రూర నేరాలకు పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పడం కంటే, అతడిని త్వరితగతిన అదుపులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని పోలీసు అధికారులను కోరారు.

అలాగే, ఈ ఘటనలకు రాజకీయ బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.