Shabad Murders | సీఎం రేవంత్ రాజీనామా చేయాలి…
Shabad Murders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : షాబాద్లో చోటుచేసుకున్న ఆరు హత్యల ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనను “ప్రభుత్వ హత్యలు”గా అభివర్ణించారు.
షాబాద్లో జరిగిన హత్యలు హృదయవిదారకమని, ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని హరీశ్ రావు ఆరోపించారు. కేవలం ఎస్ఐని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు.
మానవత్వం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హత్యల ఘటన జరిగినా ఇప్పటికీ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారని, ఇది శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని హరీశ్ రావు ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
