Trump,US–Iran-assassination attempt-Strait of Hormuz-nuclear facilities |అదే ఇరానీయులకు ఆఖరి రోజు..!ట్రంప్ సంచలన హెచ్చరిక.. అమెరికాలో అధ్యక్షుడి భద్రతపై పెరుగుతున్న అనుమానాలు
Trump,US–Iran-assassination attempt-Strait of Hormuz-nuclear facilities |అదే ఇరానీయులకు ఆఖరి రోజు..!
ట్రంప్ సంచలన హెచ్చరిక.. అమెరికాలో అధ్యక్షుడి భద్రతపై పెరుగుతున్న అనుమానాలు
నాపై హత్యాయత్నం జరిగితే ఇరాన్‌కు భారీ మూల్యం తప్పదు
అమెరికా–ఇరాన్ మధ్య మరింత ముదురుతున్న మాటల యుద్ధం
ప్రమాదకర మలుపు వద్ద శాంతి చర్చలు
ట్రంప్ హెచ్చరిక వెనుక ఉన్న అసలు సందేశం ఇదేనా..?
టెహ్రాన్ లో పేలుడు.. కొత్త అనుమానాలకు తెర
ఇరాన్ అణు కేంద్రాలపై ప్రపంచ దృష్టి
శాంతి చర్చలకా… మరో యుద్ధానికా..?
Trump,US–Iran-assassination attempt-Strait of Hormuz-nuclear facilities | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. “నాపై హత్యకు ప్రయత్నిస్తే… అదే ఇరానీయులకు ఆఖరి రోజు” అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇది కేవలం రాజకీయ వ్యాఖ్య మాత్రమే కాదు… ఇరాన్‌కు అమెరికా పంపిన అత్యంత కఠినమైన వ్యూహాత్మక సందేశంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం గమనార్హం. దీంతో అమెరికాలో ట్రంప్ భద్రతపై మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధ్యక్షుడి భద్రతపై ఇప్పటికే అత్యంత కట్టుదిట్టమైన చర్యలు అమల్లో ఉన్నప్పటికీ, తాజా పరిణామాలు కొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భద్రతాపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ హెచ్చరిక వెనుక ఉన్న అసలు సందేశం ఇదేనా..?
ట్రంప్ వ్యాఖ్యల్లో ఆగ్రహం ఎంత కనిపించినా… వాటి వెనుక అమెరికా భద్రతా వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా తనపై ఇరాన్ నుంచి ముప్పు ఉందని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు “హత్యాయత్నం జరిగితే… ఇరాన్ ఎన్నడూ చూడని స్థాయిలో ప్రతీకారం ఎదుర్కొంటుంది” అని ప్రకటించడం ద్వారా… ఎలాంటి సాహసానికైనా అమెరికా తీవ్ర ప్రతిస్పందన ఇస్తుందని ప్రపంచానికి సంకేతం ఇచ్చారు.
అమెరికాపై మాకు నమ్మకం లేదు.. ఇరాన్ కౌంటర్
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికాపై తమకు ఎలాంటి విశ్వాసం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తే… పూర్తి స్థాయి రక్షణ చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది.
ఇరాన్ లో అణు కేంద్రాలపై ప్రపంచ దృష్టి
ఇదే సమయంలో ఇరాన్ తన అణు కేంద్రాల పునర్నిర్మాణం చేపడుతోందన్న సమాచారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలు నిజమైతే… ఇరాన్ అణు కార్యక్రమం మళ్లీ వేగం పుంజుకుంటోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి పరిస్థితి ఏర్పడితే అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది.
హోర్ముజ్ లో ఉద్రిక్తతలు పెరిగితే…

ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ మార్గంలో నౌకల భద్రతకు హామీ ఇవ్వాలని అమెరికా ఇరాన్‌ను కోరుతోంది. హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు పెరిగితే… ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టెహ్రాన్ పేలుడు.. కొత్త అనుమానాలకు తెర
ఈ రోజు (శనివారం) టెహ్రాన్‌లో వినిపించిన భారీ పేలుడు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే అది దాడి కాదని… నియంత్రిత మందుగుండు సామగ్రి నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగమేనని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రతి సంఘటనను ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
శాంతి చర్చలకా… మరో యుద్ధానికా..?
మొత్తంగా చూస్తే అమెరికా–ఇరాన్ సంబంధాలు మరోసారి అత్యంత ప్రమాదకర దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ఘాటు హెచ్చరికలు… మరోవైపు ఇరాన్ ఎదురుదాడి వ్యాఖ్యలు… మధ్యలో అణు కేంద్రాల వివాదం, హోర్ముజ్ జలసంధి భద్రత, అమెరికాలో ట్రంప్ భద్రతపై పెరుగుతున్న అనుమానాలు… ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచం ఎదుట నిలిచిన ప్రశ్న ఒక్కటే… అమెరికా–ఇరాన్ మాటల యుద్ధం దౌత్య చర్చలతో ముగుస్తుందా…? లేక ఈ ఉద్రిక్తతలు మరోసారి నిజమైన సైనిక ఘర్షణకు దారి తీస్తాయా…? రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలే దీనికి సమాధానం చెప్పనున్నాయి.
