విద్యార్థుల జీవితంలో చిరస్మరణీయ ఘట్టం

యల్‌బీఆర్‌సీఈలో ఘనంగా నాల్గవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
895 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం.. 9 మందికి గోల్డ్, 11 మందికి సిల్వర్ మెడల్స్

మైలవరం, ఆంధ్రప్రభ : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (యల్‌బీఆర్‌సీఈ)లో శనివారం నాల్గవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూ కాకినాడ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్, మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి. ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేషన్ డేను ప్రారంభించి పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ఎలాంటి కోర్సు అభ్యసించినా నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కృషి, పట్టుదలతో తమ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.

యువతను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడంలో యల్‌బీఆర్‌సీఈ ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తోందని ప్రశంసించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు కృషి చేస్తున్న అధ్యాపకులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. గౌరవ అతిథి, మాజీ ఎన్‌ఐటీటీఆర్ చైర్మన్, మాజీ జేఎన్‌టీయూ కాకినాడ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ అనేది కేవలం విద్య మాత్రమే కాదని, అది ఆలోచన, సృజనాత్మకత, సమాజ అభివృద్ధికి దోహదపడే శక్తి అని అన్నారు.

నేటి గ్రాడ్యుయేట్లు భవిష్యత్ సాంకేతిక ఆవిష్కరణలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ సీనియర్ డైరెక్టర్ సురేష్ కుమార్ కడియం మాట్లాడుతూ, కృత్రిమ మేధ (AI) వేగంగా అన్ని రంగాల్లో విస్తరిస్తోందని, విద్యార్థులు AI సాంకేతికతపై అవగాహన పెంచుకుని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వ్యవస్థాపకత, సాంకేతిక ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని ప్రోత్సహించారు. కళాశాల చైర్మన్ లకిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కో-ఫౌండర్, హానరరీ చైర్మన్ లకిరెడ్డి జయప్రకాశ్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులను అభినందిస్తూ, కళాశాల అందించిన విలువలు, క్రమశిక్షణను జీవితాంతం పాటిస్తూ తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

కళాశాల ప్రెసిడెంట్ జి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏరోస్పేస్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాలకు చెందిన మొత్తం 895 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసినట్లు తెలిపారు. వీరిలో 9 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 11 మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ అందజేశారు. కళాశాల టాపర్‌గా నిలిచిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థి గోదా వంశీకృష్ణకు ప్రతిష్ఠాత్మక లకిరెడ్డి బాలిరెడ్డి గోల్డ్ మెడల్ను ముఖ్య అతిథి ప్రొఫెసర్ పి.ఉదయ భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమం ముగింపులో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఈ వేడుకలో వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రమేష్ రెడ్డి, డీన్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.