Bonalu | ఆషాఢ బోనాలకు సర్వం సిద్ధం..

గంగా–జమున తహజీబ్‌కు ప్రతీకగా హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ
జూలై 16 నుంచి గోల్కొండలో బోనాల వైభవం.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం
భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక కార్యాచరణ
బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

Bonalu | ఆంధ్రప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ప్రతి ఏడాది నిర్వహించే ఆషాఢ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా–జమున తహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం, లౌకిక స్ఫూర్తికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

జూలై 16 నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గోల్కొండ కోటలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి కొండా సురేఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, వైద్య ఆరోగ్య, జీహెచ్‌ఎంసీ, సమాచార శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే బోనాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తొలి బోనం జూలై 16న

సంప్రదాయం ప్రకారం జూలై 16న మధ్యాహ్నం గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. లంగర్‌హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే బోనం, తొట్టెల ఊరేగింపు, మెట్ల పూజ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

బోనాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, ప్రత్యేక బస్సులు వంటి అన్ని సౌకర్యాలు సమగ్రంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భద్రతపై ప్రత్యేక కార్యాచరణ

ఉత్సవాల సమయంలో ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, మహిళల భద్రత, చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానితుల వివరాలతో అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేసి భక్తులను అప్రమత్తం చేయాలని కూడా అధికారులకు సూచించారు.

శివసత్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

దైవ సేవకు అంకితమైన శివసత్తులు బోనాల సమర్పణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖలు పూర్తి సహకారం అందించాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని సంతృప్తిగా తిరిగి వెళ్లేలా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆషాఢ బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జగదాంబికా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.