Gayatri Death Case | గాయత్రి కేసులో కీలక మలుపు

భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

Gayatri Death Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌లోని మసూరీ హోమ్‌స్టేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి (27) కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. గాయత్రి భర్త శ్రీచరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన శ్రీచరణ్, రాధా గాయత్రిలకు గత ఏడాది నవంబర్‌లో వివాహం జరిగింది. గాయత్రి గురుగ్రామ్‌లో, శ్రీచరణ్ పుణెలో ఉద్యోగాలు చేస్తున్నారు. గత నెల 16న శ్రీచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ మసూరీలోని ఓ హోమ్‌స్టేకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం గాయత్రి స్పృహ లేకుండా పడిఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు.

అయితే తమ కుమార్తెను అల్లుడే హత్య చేశాడని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో డెహ్రాడూన్ కలెక్టర్ మేజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శ్రీచరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మసూరీలో అసలు ఏం జరిగింది? యువతి తల్లిదండ్రులు చేరుకోకముందే పోస్టుమార్టం ఎందుకు నిర్వహించారు? అనే కోణాలతో పాటు అన్ని అనుమానాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.