ఓటు హక్కును రక్షించుకోవాలి: డా. జీవి వెన్నెల

  • ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు

ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన ఆయుధమని, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును రక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్‌పర్సన్ డా. జీవి వెన్నెల పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో సర్పంచ్ బండారు లాలు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం దేశ ప్రజలందరి బాధ్యత అని అన్నారు.

పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఓటర్ల జాబితా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అర్హుడు తన పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపించారని డా. వెన్నెల పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన అనేక ఉద్యమాలకు యువతే ప్రధాన శక్తిగా నిలిచిందని చెప్పారు. ప్రజాకవి గద్దర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు యుద్ధంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. మండలంలోని దౌల్తాబాద్, తిరుమలపూర్, శేరిపల్లి బందారం, తిమ్మక్కపల్లి, రాయపోల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడాల రాములు, దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి, రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్, మిరుదొడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్రా రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర రవి, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు గారు, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ అమర్ రెడ్డి, మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల నాయకులు, గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.