13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు

రీయింబర్స్‌మెంట్‌ తర్వాత డబ్బులు తిరిగి ఇస్తామంటున్న యాజమాన్యాలు..
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల్లో ఆందోళన

13thDOST | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్‌ (DOST) ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్ పూర్తి చేసి కళాశాలలకు వెళ్లిన విద్యార్థుల నుంచి యాజమాన్యాలు పూర్తి కోర్సు ఫీజును ముందుగానే చెల్లించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ప్రవేశం పొందాలంటే విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఫీజును ఒకేసారి చెల్లించాలని, అనంతరం ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలైన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకోవాలని భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 13న దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగా, ఇప్పటివరకు మూడు విడతల్లో సీట్ల కేటాయింపు పూర్తయింది. సీటు పొందిన విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేసి, అనంతరం సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేసి ప్రవేశం పొందాల్సి ఉంటుంది. ఈ నెల 4వ తేదీలోగా కళాశాలలో రిపోర్ట్ చేయకపోతే కేటాయించిన సీటు రద్దయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఫీజులు చెల్లిస్తుందనే కారణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ, స్వయంప్రతిపత్తి (అటానమస్‌) కళాశాలల్లో గత కొన్నేళ్లుగా కోర్సు ఫీజులు గణనీయంగా పెరిగాయి.

నిజాం కాలేజీలోనూ ఇదే పరిస్థితి..

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాల కోసం వెళ్లగా, పూర్తి ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్‌ ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ముందస్తు ఫీజు లేకుండానే ప్రవేశం కల్పించేవారు. అయితే ప్రస్తుతం ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ ముందుగా ఫీజు చెల్లించాల్సిందేనని చెబుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. హైదరాబాద్‌లోని మరికొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ఇదే విధానం అమలవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఆలస్యంగా విడుదల కావడం వల్లే కళాశాలలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని విద్యార్థి వర్గాలు పేర్కొంటున్నాయి.