108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణిని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే 108 అంబులెన్స్‌లో ప్రసవం జరిగిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అమ్మాపురం గ్రామానికి చెందిన సీమ మూడో కాన్పు కోసం పురిటి నొప్పులతో తొర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సుమారు 40 నిమిషాల పాటు ఉంచిన అనంతరం, ప్రసవం ఇక్కడ సాధ్యం కాదని చెప్పి 108 అంబులెన్స్ ద్వారా వర్దన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

సమాచారం అందుకున్న పెద్దవంగర 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ రఘు, పైలట్ నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని గర్భిణిని వర్దన్నపేట ఆసుపత్రికి తరలించారు.

మార్గమధ్యంలోనే ప్రసవం

నాంచారిమడూరు సమీపానికి చేరుకోగానే గర్భిణికి పురిటి నొప్పులు తీవ్రంగా రావడంతో అంబులెన్స్‌ను రోడ్డుపక్కన నిలిపి, ఈఎంటీ రఘు ప్రసవానికి సహకరించారు. దీంతో సీమ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును వర్దన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

108 సిబ్బందికి ప్రశంసలు

సకాలంలో స్పందించి సురక్షిత ప్రసవం నిర్వహించిన ఈఎంటీ రఘు, పైలట్ నవీన్‌లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వర్దన్నపేట ఆసుపత్రి సిబ్బంది కూడా 108 బృందాన్ని అభినందించారు.

రిఫరల్‌పై స్పష్టత రావాల్సి ఉంది

తొర్రూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం సాధ్యం కాదని రిఫర్ చేసిన గర్భిణికి అంబులెన్స్‌లో బయలుదేరిన పది నిమిషాల్లోనే ప్రసవం జరగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఎందుకు ప్రసవం నిర్వహించలేదనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.