వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం

ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకుల బోటు బోల్తా..
18 మంది మృతి చెందినట్లు సమాచారం
కొనసాగుతున్న గాలింపు చర్యలు
హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వియత్నాంలో శనివారం ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పర్యాటక బోటు నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. మృతుల్లో కొందరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉండొచ్చని సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన అనంతరం వియత్నాం అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య, గల్లంతైన వారి వివరాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు మునిగిపోయిన విషాద ఘటనపై స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపింది.

బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు, అవసరమైన సహాయం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా హనోయిలోని భారత రాయబార కార్యాలయంలో కూడా ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాతావరణ పరిస్థితులా, సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణమా అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.