India New Zealand Relations | భారత్–న్యూజిలాండ్ బంధం మరింత బలోపేతం

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
ఆక్లాండ్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని..
క్రీడలు, వాణిజ్యం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై దృష్టి
భారతీయుల సేవలను కొనియాడిన న్యూజిలాండ్ ప్రధాని లక్సన్..
‘కివీ ఇండియన్’ సమాజం దేశాభివృద్ధికి కీలకమని వ్యాఖ్య

India New Zealand Relations |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆక్లాండ్‌లో నిర్వహించిన భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధాన్ని గుర్తు చేశారు. భారత్–న్యూజిలాండ్ సంబంధాలు ప్రజల మధ్య ఉన్న అనుబంధంతో మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. క్రీడలు, వాణిజ్యం, సాంకేతికత, అంతరిక్షం, విద్య తదితర రంగాల్లో రెండు దేశాలు కలిసి మరిన్ని విజయాలు సాధించగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.

న్యూజిలాండ్‌లో భారతీయ మూలాలున్న పలువురు ప్రముఖులు వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాలను అధిరోహించారని మోదీ గుర్తు చేశారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈఓ నిఖిల్ రవిశంకర్, మాజీ గవర్నర్ జనరల్ ఆనంద్ సత్యానంద్, క్రికెటర్లు రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, అజాజ్ పటేల్ వంటి వారు అందుకు ఉదాహరణలని అన్నారు. న్యూజిలాండ్‌లోని పలు ప్రాంతాలకు బాంబే, ఢిల్లీ, అమృత్‌సర్, కలకత్తా, కోరమండల్ వంటి భారతీయ నగరాల పేర్లు పెట్టడం రెండు దేశాల మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనమని చెప్పారు.

భారత్–న్యూజిలాండ్ క్రీడా సంబంధాలకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు. 1926లో భారత హాకీ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించగా, మేజర్ ధ్యాన్ చంద్ ప్రతిభ అక్కడి ప్రజల మనసులు గెలుచుకుందని పేర్కొన్నారు. రగ్బీ క్రీడలో న్యూజిలాండ్ నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, కోచ్‌లు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతరిక్ష రంగంలో కూడా రెండు దేశాల సహకారం కొనసాగుతోందని మోదీ చెప్పారు. చంద్రయాన్ విజయానికి న్యూజిలాండ్ సాంకేతిక సహకారం కూడా దోహదపడిందని పేర్కొన్నారు. అలాగే వాణిజ్య ఒప్పందాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, స్టార్టప్‌లు వంటి రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని వివరించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఆయన అన్నారు.

మావోరీ సంస్కృతిని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని, ‘హాకా’ సంప్రదాయంలో ధైర్యం, ఆత్మగౌరవం, సమిష్టి శక్తి ప్రతిఫలిస్తాయని చెప్పారు. మావోరీల ‘మనకితాంగ’ భావన, భారతీయుల ‘అతిథి దేవో భవ’ సంప్రదాయం ఒకే విలువలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

అలాగే సిక్కు సంప్రదాయాలకు సంబంధించిన ‘జోడే సాహిబ్’ను పాట్నా సాహిబ్‌కు తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన మోదీ, హేమ్‌కుండ్ సాహిబ్‌కు రోప్‌వే నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. సాహిబ్‌జాదాల త్యాగాలను స్మరించేందుకు ప్రతి ఏడాది డిసెంబర్ 26న ‘వీర్ బాల్ దివస్’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇక, ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించడానికి గతంలో 40 సంవత్సరాలు పట్టిందని గుర్తు చేసిన మోదీ, ఇకపై అంత సుదీర్ఘ విరామం ఉండదని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కూడా పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లో నివసిస్తున్న సుమారు 3.3 లక్షల భారతీయ మూలాలున్న ప్రజలు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక బలంగా మారారని ఆయన కొనియాడారు. వారి ద్వారా ఏటా సుమారు 37 బిలియన్ డాలర్ల ఆర్థిక విలువ సృష్టించబడుతోందని, అది దేశ జీడీపీలో సుమారు 9 శాతం వాటా కలిగి ఉందని తెలిపారు. వైద్యులు, నర్సులు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, అకౌంటెంట్లు వంటి అన్ని రంగాల్లో భారతీయులు విశేష సేవలు అందిస్తూ న్యూజిలాండ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని లక్సన్ ప్రశంసించారు.