జాతీయ రహదారి పై రైతుల బైఠాయింపు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో రైతులు చేతికొచ్చిన వరి పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెన్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ స్థానిక గోదాముల్లోనే తమ వడ్లను అన్‌లోడ్ చేయాలని డిమాండ్ చేశారు. లారీలు అందుబాటులో లేక ధాన్యం తరలింపు నిలిచిపోయిందని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా గిడ్డంగులు, వ్యవసాయ మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు.
రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే ప్రయాణికులతో పాటు అంత్యపుష్కరాలకు వెళ్తున్న భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న చెన్నూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్ ఘటనాస్థలికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
