గ్రంథాలయాలకు రావడం మంచి అలవాటు..

గ్రంథాలయాలకు రావడం మంచి అలవాటు..

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎడ్యుకేషన్ వీక్ సందర్భంగా “లైబ్రరీ డే” ఘనంగా నిర్వహణ ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమాలలో భాగంగా ఎడ్యుకేషన్ వీక్ సందర్భంగా శుక్రవారంరోజు వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో “లైబ్రరీ డే” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జ్ఞానానికి నిలయమైన గ్రంథాలయాల ప్రాముఖ్యతను సమాజానికి చాటిచెప్పే విధంగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సేరి రాజేష్ రెడ్డి పాల్గొనగా, విశిష్ట అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి మరియు మండల విద్యాధికారి యన్. బాబు సింగ్ హాజరయ్యారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ సేరి రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, “గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. విద్యార్థులు, ఉద్యోగార్థులు గ్రంథాలయ వనరులను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి” అని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధి, పాఠశాల స్థాయిలో పఠన సంస్కృతి బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి రేణుకా దేవి గారు మాట్లాడుతూ, గ్రంథాలయంలో చదవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత పెంపొందుతుందని, తద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను సులభంగా సాధించగలరని అన్నారు.

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు సహకరిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి. సురేష్ బాబు గారు మాట్లాడుతూ, 1959 సంవత్సరం నుండి 2026 వరకు జిల్లా గ్రంథాలయం సాధించిన ప్రగతిని వివరించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఉద్యోగార్థులు, విద్యార్థుల కోసం మెరుగైన మౌలిక వసతులు, ప్రశాంత పఠన వాతావరణం కల్పించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. గ్రంథాలయాన్ని విజ్ఞాన దేవాలయంగా భావించి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే విజయం సాధ్యం అవుతుందని సూచించారు.

ఈ సందర్భంగా వివిధ పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉద్యోగాలు పొందిన సుమారు 13 మందిని ఘనంగా సన్మానించారు. తరచుగా గ్రంథాలయాన్ని వినియోగిస్తున్న పాఠకులను కూడా అభినందించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమ అనుభవాలను ఇతర చదువరులతో పంచుకుంటూ, గ్రంథాలయం విజయానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా మండల విద్యాధికారి యన్. బాబు సింగ్ గారు వ్యవహరించగా, కార్యక్రమ వ్యాఖ్యాతగా శ్రీ ఎం. అశోక్ గారు (SGT, నాగసముందర్) సేవలందించారు. చివరగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీ పి. సురేష్ బాబు గారు సభకు విచ్చేసిన అతిథులు, అధికారులు, పాఠకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది అరవింద్, స్రవంతి, సరిత, విద్యాశాఖ సిబ్బంది, సుమారు 100 మంది ఉద్యోగార్థులు, విద్యార్థులు, పాఠకులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply