ఎల్‌వోసీ పత్రాలు అందజేత

వైద్య చికిత్స కోసం రూ.2.35 లక్షలకుపైగా ఆర్థిక సాయం

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన తొమ్మండ్రు వేణుకు వైద్య చికిత్స కోసం రూ.1,12,934 విలువైన ఎల్‌వోసీని మంజూరు చేశారు. అలాగే మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన బోడే సంజనకు రూ.1,22,558 విలువైన ఎల్‌వోసీని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మాట్లాడుతూ, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వైద్య చికిత్స కోసం ఇబ్బందులు పడకుండా ఎల్‌వోసీ ద్వారా ప్రభుత్వం చేయూత అందిస్తోందని తెలిపారు.