యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన పాలకమండలి ఏర్పాటు

  • చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

యాదగిరికొండ, ఆంధ్రప్రభ : విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం నూతన పాలకమండలిని (బోర్డు) ప్రకటిస్తూ మంగళవారం అత్యంత కీలకమైన జీవోను జారీ చేసింది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ (సవరణ) చట్టం 2025లోని సెక్షన్ 96(1) ప్రకారం ఈ నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ రెవెన్యూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో నంబర్ 392 ద్వారా అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.

యాదాద్రి దేవస్థాన నూతన పాలకమండలి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దేవాదాయ శాఖ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయ బోర్డులో చైర్మన్‌తో పాటు రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులకు సభ్యులుగా పెద్దపీట వేశారు.

ఈ నూతన పాలకమండలిలో సభ్యులుగా మెగాస్టార్, ప్రముఖ నటుడు చిరంజీవి ధర్మపత్ని కొణిదెల సురేఖ, మాజీ హోంశాఖ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ తూళ్ల, శాసనసభ్యులు (ఎమ్మెల్యే) వినోద్ వెంకటస్వామి, చిలపగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వ్యవస్థాపక ట్రస్టీలు నియమితులయ్యారు.

అయితే, ఇంతటి ప్రతిష్టాత్మకమైన యాదాద్రి నూతన పాలకమండలిలో కనీసం యాదగిరిగుట్ట స్థానికులకు కానీ, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖులకు కానీ సరైన స్థానం కల్పించకపోవడంపై స్థానిక ప్రజలు, భక్తుల నుండి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండు సంవత్సరాల పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

దేవస్థాన సమగ్ర అభివృద్ధి, పరిపాలనా పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ఈ బోర్డులో అత్యున్నత స్థాయి అధికారులను ఎక్స్-అఫీషియో సభ్యులుగా చేర్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) వైస్ చైర్మన్, యాదాద్రి దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) జె. భవానీ శంకర్, ఆలయ స్థానాచార్యులు లేదా సీనియర్ ప్రధాన అర్చకులు ఈ నూతన పాలకమండలిలో ఎక్స్-అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు.

నూతనంగా నియమితులైన చైర్మన్ మరియు పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడానికి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన (ఈవో) తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దేవాదాయ శాఖ మంత్రిత్వ శాఖ ప్రత్యేక అధికారి (OSD), ముఖ్యమంత్రితో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులందరికీ ఈ ఉత్తర్వుల ప్రతిని పంపినట్లు జీవోలో పేర్కొన్నారు.