ఉద్యాన పంటల సాగుతో రైతులకు అధిక లాభాలు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పామాయిల్ సాగుకు అనుకూల సమయమని, ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని పెద్దపల్లి మండల ఉద్యానవన విస్తరణ అధికారి బి. రాము తెలిపారు. మంగళవారం మండలంలోని రాఘవాపూర్, పెద్దబొంకూర్ శివార్లలో సాగు చేస్తున్న పామాయిల్, బీర, కీరదోస, కూరగాయల తోటలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి, పత్తి, మొక్కజొన్న వంటి సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు, పామాయిల్ సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యాన పంటలను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఉద్యాన పంటలకు సంబంధించి డ్రిప్, స్ప్రింక్లర్, పామాయిల్, పండ్ల తోటలు, కూరగాయల సాగుపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాల ప్రయోజనాలు పొందాలంటే రైతు రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. డ్రిప్ సేద్యంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. పామాయిల్ మొక్కలు నాటేందుకు ప్రస్తుతం అనుకూల సమయమని, ఫార్మ్పాండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలవల తిరుపతి, ఉద్యానవన రైతులు అడిచర్ల శంకరయ్య, రాజేశం, తిరుపతి, వంశీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
