సీపీఎం నిరాహార దీక్ష భగ్నం.. పోలీసుల తీరుపై విమర్శలు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనపై సీపీఎం నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్ల మరమ్మతుల విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించాల్సి ఉండగా, దీక్షను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని వారు విమర్శించారు. రహదారుల సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ మాట్లాడుతూ, అన్నింటికీ పోలీసులు బాధ్యత వహిస్తామంటే సంబంధిత శాఖల పాత్ర ఏమిటని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాలో మాత్రమే పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు వ్యవహరించడం ఎందుకని నిలదీశారు.

ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకే పోలీస్ యాక్ట్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇదే విధానం కొనసాగితే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.